తొందరపడకురా సుందరవదనా…

ఒక పెద్ద కంపెనీకి అధిపతి తమ కార్యాలయాన్ని సందర్శించడానికి వస్తున్నాడు. అందరూ అటెన్షన్‌గా తమ పని తాము చూసుకుంటున్నారు. యజమాని  తమ డెస్క్‌కి దగ్గరగా వచ్చినపుడు చిరునవ్వుతో విష్ చేస్తున్నారు. అలా ఆయన నెమ్మదిగా ఆయన గది వైపు సాగిపోతున్నాడు. ఆయనను చూసిన అందరూ పైకి లేచి విష్ చేశారు ఒక్కరు తప్ప. ఆ ఒక్కడు ఒక్క క్షణం యజమాని వైపు తలెత్తి చూసి కళ్ళతోనే విష్ చేసి మరలా తన పనిలో నిమగ్నమైపోయాడు.

యజమాని ఆలోచిస్తూ తన గదిలోకి వెళ్ళాడు. అక్కడి ఆఫీస్ హెడ్ ను తన గదికి పిలిపించాడు.
“ఫైర్ హిమ్ ఇమ్మీడియట్లీ” ఆజ్ఞాపించాడు వెంటనే.
“సర్ అదీ….. అతను….” అంటూ నీళ్ళు నమిలాడు ఆఫీస్ హెడ్డు.
“నాకింకేమీ చెప్పద్దు… ముందతన్ని ఉద్యోగం నుంచి తీసేయండి. యజమానికి కనీస మర్యాద ఇవ్వలేని వాడికి ఇక్కడ పనిచేసే అర్హత లేదు” అన్నాడు.
మారుమాట్లాడలేదు ఆఫీస్ హెడ్డు. అతన్ని ఉద్యోగం నుంచి తీసేశారు.

కొద్ది రోజులు గడిచాయి. యజమాని ఆ సంఘటన గురించి పూర్తిగా మరిచిపోయాడు. ఆయనకు ఆఫీస్ సక్రమంగా నడుస్తున్నట్లు కనిపించలేదు. వెంటనే అధికారులతో సమావేశం ఏర్పాటు చేశాడు.
“ఇప్పటి దాకా బాగా నడుస్తున్న ఆఫీసులో అకస్మాత్తుగా ఈ పరిణామాలేంటి?” అని ప్రశ్నించాడు.
“మన ఆఫీసులో పనిచేసే ఒక ప్రతిభావంతమైన ఉద్యోగిని  మీరు కొన్ని రోజుల క్రిందటే బాధ్యతల నుంచి తొలగించారు.” అన్నాడు ఒక అధికారి.
“ఎందుకు తొలగించాము?” అని ఎదురు ప్రశ్నించాడు ఆ అధికారిని.
“మీరు ఆఫీసుకు వచ్చినపుడు అతను పైకి లేచి విష్ చేయలేదు, అందుకని…” సమాధానమిచ్చాడా అధికారి.
” మరి అలా చేయడం క్రమశిక్షణారాహిత్యం కాదా?”
“కాదు సర్. ఎందుకంటే అతనికి రెండు కాళ్ళు లేవు.
యజమాని గుండె కలుక్కుమంది.
“మరి ఈ సంగతి నాకు ముందే ఎందుకు చెప్పలేదు?” ప్రశ్నించాడు.
“మీరు తీసుకున్న నిర్ణయానికి ఎదురు చెప్పే స్వేచ్ఛ మాకు లేదు కదా సర్!”

“సరే జరిగిందేదే జరిగిపోయింది. నేను వెళ్ళి అతన్ని మళ్ళీ ఈ ఉద్యోగంలోకి రమ్మని కోరతాను” అని చెప్పి అతని చిరునామా సేకరించి ఇంటికి వెళ్ళాడు. ఆయన వెళ్ళేసరికి అతను తన చుట్టూ నలుగుర్ని కూర్చుండబెట్టుకుని వాళ్ళకు ఏదో చెబుతున్నారు. తన మాజీ యజమానిని కళ్ళతోనే పలకరించాడు. వచ్చిన పని ఏంటని అడిగాడు. జరిగిందానికి తాను చాలా చింతిస్తున్నానీ, దయచేసి మళ్ళీ విధుల్లో చేరాల్సిందిగా కోరాడు.

“నన్ను క్షమించండి. ముందు వెనకా ఆలోచించకుండా నిర్ణయాలు తోసుకునే బాస్ క్రింద నేను పనిచేయలేను. నేను పడ్డ అవమానాలు నాలాంటి వికలాంగులు పడకూడదనే నాకు వీలైనంతో కొద్ది మందిని చేరదీసి శిక్షణ ఇస్తున్నాను. నా జీవితానికి ఇది చాలు” అన్నాడు.

భారమైన హృదయంతో ఇంటికి చేరుకున్నాడా యజమాని. చాలాసేపు ఆలోచించాడు. మరుసటి రోజు నుంచీ తన పద్దతుల్లో మార్పు తెచ్చుకున్నాడు. తన ఉద్యోగులకి పూర్తి స్వేచ్చనిచ్చాడు. తన కంపెనీని విజయ పథంలో నడిపాడు. ఆయన ఎవరో కాదు. ఫోర్డ్ మోటార్స్ అధినేత హెన్రీ ఫోర్డ్