పులికి ఏ అడవి ఐతే ఏంటీ!

నేను పదోతరగతి చదువుతున్న రోజులవి. ఎనిమిదో తరగతి దాకా మా ఊళ్ళో చదివి తొమ్మిది, పదో తరగతి కోసం శ్రీకాళహస్తికి వచ్చి ఆర్.పి.బి.యస్ బాలుర ఉన్నత పాఠశాలలో చేరాను. అక్కడ మాకు ఆనంద్ మాస్టారు గణితం బోధించే వారు.సాధారణ తెలివి తేటలుగల  విద్యార్థులకు కూడా అర్థమయ్యే రీతిలో బోధించడంలో ఆయన సిద్ధ హస్తులు.పల్లెటూరి నుంచి బెరుకు బెరుకుగా వచ్చి ఆ పాఠశాలలో అడుగుపెట్టిన నన్ను ఆయన ఎంతగానో ప్రోత్సహించారు.  సాయంత్రం సమయంలో ఆయన ట్యూషన్లు కూడా చెప్పేవాడు. నా చదువు కోసం అమ్మ తో పాటు పట్టణానికి వచ్చి చిన్న గది అద్దెకు తీసుకున్నాం. అది ఆయన ట్యూషన్ కు దగ్గరగా ఉండేది. అక్కడ ఆయన కేవలం తెలుగు మాధ్యమంలో చదివే విద్యార్థుల కోసం గణితం, ఆంగ్లము, సైన్సు బోధించేవారు.నేను ఆయన ట్యూషన్ లో చేరాను.

కొద్ది రోజుల్లోనే ఆయనకు నాపైన, నాకు ఆయనపైన  ప్రత్యేకమైన అభిమానం ఏర్పడింది. అయితే, ఎవరైనా సరే ఆయన దగ్గర బెత్తం దెబ్బ తినకుండా బయటికి వెళ్ళినవారు లేరు. నేను కూడా అందుకు అతీతుణ్ణి కాదు. ఒకే ఒక సారి ఆయన దెబ్బ తిన్నాను.అది అప్పుడు ఆ క్షణంలో బాధ కలిగించినా దాని విలువ తర్వాత తెలిసింది. దాని తియ్యదనం కలకాలం గుర్తుండి పోయింది. ఆయన కొట్టే టప్పుడు కూడా   ఏరా! పోరా! అని సంభోదించే వారు కాదు. ” ఏవండీ! చెయ్యి పట్టండి… చెయ్యి పట్టండీ” అని సున్నితంగా చెప్పి టపీ మని అరచేతి మీద ఒక్క దెబ్బ వేసేవారు. ఆ దెబ్బ వల్ల నేను చూసినంతవరకూ ఎవరూ  ఏడవలేదు. కానీ కొట్టిన ప్రతి దెబ్బా మమ్మల్ని ఒక శిల్పి శిల్పం చెక్కడం కోసం వేసిన ఒక ఉలి దెబ్బగానే  భావించే వాళ్ళం. ఎవరూ ఇంటికెళ్ళి మా మాస్టారు మమ్మల్ని కొట్టాడని పిర్యాదు చేసేవాళ్ళం కాదు.

అలా ఆయన దగ్గర ఎంతో క్రమశిక్షణతో చదివి పదో తరగతి పూర్తి చేసుకున్నాను. 504 మార్కులు వచ్చాయి. అవి మా పాఠశాలలో రెండవ అత్యధిక మార్కులు. మా అమ్మమ్మ గారి ఊరు ముచ్చివోలు కాకర కాయలకు ప్రసిద్ధి. మా ప్రియతమ మాస్టారుకి అవంటే ఎంతో మక్కువ. కాబట్టి ఆ సందర్భంగా ఆయనకు తీపి వార్త చెబుదామని అవి తీసుకెళ్ళాను. ఆయనకు చక్కెర వ్యాధి  ఉండేది. అందుకనే స్వీట్స్ తీసుకుని వెళ్ళలేదు.నాలాంటి విద్యార్థుల్ని ఆయన ఎంతో మందిని చూసి ఉండవచ్చు. కానీ నేనా వార్త చెప్పినపుడు మాటల్లో చెప్పలేని ఆనందం ఆయన కళ్ళలో చూశాను.

” ఇంటర్ కి ఎక్కడ చేరుతున్నారు?” అని అడిగాడు.
“ఇంకా ఏమీ నిర్ణయించుకోలేదు సార్” అన్నాన్నేను.
“విక్రం కాలేజీలో చేరండి. మరి మీరు ఇంగ్లీష్ మీడియం లోకి మారండి” అన్నాడు.
“ఇప్పటి దాకా తెలుగు మీడియంలో చదివిన నేను ఇప్పుడు ఇంగ్లీష్ మీడియంలోకి మారితే అంతా కొత్తగా ఉంటుందేమో సార్. నాకు భయంగా ఉంది”  అన్నాను.
అప్పుడాయన అన్న మాట నిజంగా నా జీవితాన్ని మలుపు తిప్పింది.

పులికి ఏ అడవైతే ఏమండీ!

ఆ మాట వినగానే నా రోమాలు ఒక్కసారిగా నిక్కబొడుచుకున్నాయి. ఎక్కడలేని ఆత్మవిశ్వాసం వచ్చింది. ఎందుకంటే ఆయన ఎవర్నీ ఎదురుగా ప్రశంసించింది లేదు. ఆయన చెప్పినట్లే ఇంటర్ లో ఇంగ్లీష్ మీడియంలో చేరాను. 942 మార్కులు వచ్చాయి. అవి పట్టణంలో అత్యధిక మార్కులు. ఆయన ఆ రోజు అన్న మాటలు ఎన్నటికీ మర్చిపోలేనివి. ఇప్పటికీ నాకు ఏదైనా సమస్య వచ్చినపుడల్లా ఆ వాక్యాలను మననం చేసుకుని ఉత్తేజితుణ్ణి అవుతుంటాను.

నాకు అంతటి భవిష్యత్తుని ప్రసాదించిన పూజ్య గురువర్యులకు  భక్తితో ఈ పోస్టు అంకితం.

ప్రకటనలు

17 thoughts on “పులికి ఏ అడవి ఐతే ఏంటీ!

  1. Chala baga rasaru… mimmalni choosaka, aayana maatallo entha nijam vundo artham ayindi… ilage mee bhavishyathu lo inka manchi peru techukovalani ashistunnanu…

  2. చాలా బాగుంది. అలాంటి గురువులు ఎవరికైనా దొరకడానికి ఎంతో అదృష్టం ఉండాలి.

  3. నిజంగ నీకు అటువంటి గురువు దొరకడం నీ అద్రుస్టం దబ్బుల కొసం మత్రమె పని చెసె గురువులున్న ఈ రొజుల్లొ మంచి గురుంచు అలొచించె అతువంతి గురువుతొ ఎన్ని దెబ్బలు తిన్న పరవలెదు గురువుగరు అరొగ్యం బగుందలని అ దెవుదికి ప్రర్దిస్తున్న

    మంచి గురువు ఎవరికైన గురువె నండి

    • ప్రవీణ్ గారు! సెలవులో ఉన్నాను. అందుకనే సమాధానమివ్వలేదు. చాలా సంతోషం ఈ సంఘటన మీకు నచ్చినందుకు. ఇలాంటి వాటి గురించి తప్పకుండా మీతో పంచుకుంటాను

  4. ఈ టపాని చదువుతూంటే ఒక్క సారి నేను చదివిన రోజుల్లొకి వెళ్ళిపొయానంటే నమ్మండి. మా నాన్నగారు కూడా ప్రభుత్వోపాధ్యాయుడే.తను పని చేసే పాఠశాల గురించి అక్కడి విద్యార్ఠుల గురించి చెప్పేవాళ్ళు.ప్రతిభ కలిగిన విద్యార్ఠుల గురించి చెప్పక్కర్లేదు.వారికి సరైన ప్రొత్సాహం ఇస్తే వారికి ఉజ్వల భవిష్యతు ఉందని చెప్పేవారు.అవి నాలో తెలియని ఉత్తేజాన్ని కలిగించేవి. మీ ఈ టపా మళ్ళి ఆ పాత రోజులని గుర్తుకు తెచ్చాయి.ఏది ఏమైనా ఆచార్యులు మన భవిష్యత్తు కి బంగారు బాటలు వేస్తారనడంలో సందేహం లేదు.

    “ఆచార్యదేవోభవ”

వ్యాఖ్యలను మూసివేసారు.