కాలేజ్ డేస్…. హ్యాపీ డేస్

నాకు గడిచిపోయిన రోజలన్నీ  మధుర స్మృతులు గానే కనిపిస్తాయి. నా బీటెక్ రోజుల్లో జరిగిన అలాంటి సంఘటన ఒకటి మీ కోసం…

మా క్లాసులో కొంతమంది  సీరియస్ క్యాండిడేట్స్ ఉండేవాళ్ళం. ఎంత సీరియస్ అంటే  మిగతా వాళ్ళు  ఏదైనా ఆడుకునేటప్పుడు కూడా మమ్మల్ని పిలిచే వాళ్ళు కాదు. మా సరదాలేవో  మా వరకే ఉండేవి. ఒక రోజు ఏమైందంటే అంతా కలిసి తరగతులు ఎగ్గొట్టి సినిమాకు వెళ్దామని నిర్ణయించారు. పిలిచినా మేం రామనుకున్నారో ఏమో  మమ్మల్ని పిలవలేదు. నిజానికి ఆ రోజు వాళ్ళు పిలిచి ఉంటే వాళ్ళతో వెళ్ళి ఉండే వాళ్ళమే.
మమ్మల్ని  పిలవలేదనే అక్కసుతో మిగిలిపోయిన వాళ్ళమంతా కలిసి ఎలాగైనా క్లాసు పెట్టించాలనుకుని  లెక్చరర్ని ఒప్పించి మా పంతం నెరవేర్చుకున్నాం.

ఆ రోజుకు క్లాసెస్ పూర్తయ్యాయి. సాయంత్రం ఒక్కడినే సైకిల్ మీద ఇంటికి వెళుతున్నాను. దారిలో సినిమా నుంచి తిరిగొస్తున్న మా మిత్రులు ఎదురు పడ్డారు. దారిలో వస్తూ వస్తూ ఎక్కడైనా తీర్థం పుచ్చుకున్నారో ఏమో!కొంచెం కంట్రోల్ తప్పినట్లున్నాడు గురుడు. ఒకడు నా సైకిల్ ఆపి  “ఏరా! మేమంతా సినిమాకి వెళితే నువ్వు మాత్రం క్లాసు పెట్టిస్తావా? మేమంతా వెధవల్లాగా కనిపిస్తున్నామా నీకు? అసలు మేము లేకుండా నువ్వు క్లాస్ ఎలా పెట్టిస్తావు?అసలేం జరుగుతుంది ?  నాకు సమధానం చెప్పి తీరాలి?” అంటూ హరిక్రిష్ణ లెవెల్లో నన్ను అడ్డగించాడు.

నాకు ఏమి సమాధానం చెప్పాలో తోచలేదు.  నేను పడుతున్న ఇబ్బంది చూసి అందులో కొంచెం కంట్రోల్ లో ఉన్న ఇంకొకడు వాణ్ణి పక్కకి లాగి నన్ను నెమ్మదిగా జారుకోమన్నాడు. బ్రతుకు జీవుడా అంటూ అక్కణ్ణుంచి  బయట పడ్డాను.

ఇంక అప్పట్నుంచీ అలా ఎప్పుడూ క్లాసులు పెట్టించలేదు సరికదా నా పీజీ కోసం వరంగల్ కి వెళ్ళినపుడు బంక్ కొట్టడంలో నేనే ముందుండే వాడిని.
ఇదండీ నా తీపి జ్ఞాపకాల పుస్తకంలో ఒక పేజీ… ఎలా ఉంది?

ప్రకటనలు

4 thoughts on “కాలేజ్ డేస్…. హ్యాపీ డేస్

  • అవునండీ! నేనే కాదు. నాలాగే చాలా మంది. నేను చదివిన కళాశాలలో గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన విద్యార్థులే ఎక్కువ. వాళ్ళ కుటుంబాల ఆర్థిక స్థోమత సైకిల్ కంటే మించదు. అందుకు నేను మినహాయింపు కాదు. అందుకే ఇప్పటికీ నాకు బైక్ నడపడం రాదు. 🙂

 1. గడచిన రోజులన్నీ తీపి ఙాపకాలుగానే ఉంటాయి.

  మీ “Happy Days” చదువుతూంటే నా కాలేజి రోజుల్లో జరిగిన ఒక తమాషా అనుభవం గుర్తుకు వస్తోంది.

  మీ క్లాస్ లొ లాగే మా చ్లాస్ లో అబ్బయిలు అందరు అల్లరి చేసేవాళ్ళు,అమ్మాయిలు అల్లరి చేసినా అంత బయత పడేవాళ్ళు కాదు. ఒక బ్యాచ్ ఉండేవాళ్ళు కొత్త సినిమా వచ్చిందంటే చాలు క్లాసులు బంక్ చేసేవాళ్ళు. వారి ద్వారా ఆ సినిమా ఎలా ఉందో అని మేము కనుక్కునే వాళ్ళము.మేము నలుగురు అమ్మాయిలము బ్యాచ్ ఉండేవాళ్ళము. మీ బ్యాచ్ లా అనుకోండి. అంతే క్లాసులు బంక్ చేసేవాళ్ళము కాదు ,కొంచం సీరియస్ టైపు అన్నమాట.మిగతా అమ్మాయిలు క్లాసులకి ఉండేవాళ్ళు వారికిష్టం అయ్యినప్పుడు బంక్ చేసేవాళ్ళు. ఒక సారి “శంకర్ దాదా యం బి బి యస్ ” సినిమా రిలీజ్ అయ్యింది.షరా మాములుగా అబ్బాయిల బ్యాచ్ వెళ్ళిపొయింది. మిగతా అమ్మాయిల బ్యాచ్ ఏమనుకున్నారో వళ్ళు కూడా ఈ సినిమా కి వెళ్ళలని డిసైడ్ అయారు. మా బ్యాచ్ వాళ్లని రమ్మన్నారు.మా వాళ్ళు అందుకు ఒప్పుకోలేదు. అందరు వెళ్ళిపోయారు. అవేమో చివరి సెమిస్టర్ రోజులు. పెద్దగా క్లాసులు జరగవు అని మాకు తెలుసు. మేము మాత్రం ఉండి ఏం చెయ్యలని మేము సినిమా కి వెళ్దామని డిసైడ్ అయ్యాము.ఇటు చూస్తే మొదటి రోజు మొదటి ఆటకి వెళ్ళాలంటే భయం.కొంచం ఆలోచించాక “సై” సినిమా వచ్చి ఉంది ఆ సమయం లో.దానికి వెళ్ల్దామని డిసైడ్ అయ్యి మేము నలుగురం ఆ సినిమా కి వెళ్ళాము.
  అదే నా కాలేజి రోజుల్లోని ఫర్స్ట్ బంక్.
  ఇప్పటికీ ఇది తలచుకుంటే నాకు నవ్వొస్తుంది.

వ్యాఖ్యలను మూసివేసారు.