కాలేజ్ డేస్…. హ్యాపీ డేస్

నాకు గడిచిపోయిన రోజలన్నీ  మధుర స్మృతులు గానే కనిపిస్తాయి. నా బీటెక్ రోజుల్లో జరిగిన అలాంటి సంఘటన ఒకటి మీ కోసం…

మా క్లాసులో కొంతమంది  సీరియస్ క్యాండిడేట్స్ ఉండేవాళ్ళం. ఎంత సీరియస్ అంటే  మిగతా వాళ్ళు  ఏదైనా ఆడుకునేటప్పుడు కూడా మమ్మల్ని పిలిచే వాళ్ళు కాదు. మా సరదాలేవో  మా వరకే ఉండేవి. ఒక రోజు ఏమైందంటే అంతా కలిసి తరగతులు ఎగ్గొట్టి సినిమాకు వెళ్దామని నిర్ణయించారు. పిలిచినా మేం రామనుకున్నారో ఏమో  మమ్మల్ని పిలవలేదు. నిజానికి ఆ రోజు వాళ్ళు పిలిచి ఉంటే వాళ్ళతో వెళ్ళి ఉండే వాళ్ళమే.
మమ్మల్ని  పిలవలేదనే అక్కసుతో మిగిలిపోయిన వాళ్ళమంతా కలిసి ఎలాగైనా క్లాసు పెట్టించాలనుకుని  లెక్చరర్ని ఒప్పించి మా పంతం నెరవేర్చుకున్నాం.

ఆ రోజుకు క్లాసెస్ పూర్తయ్యాయి. సాయంత్రం ఒక్కడినే సైకిల్ మీద ఇంటికి వెళుతున్నాను. దారిలో సినిమా నుంచి తిరిగొస్తున్న మా మిత్రులు ఎదురు పడ్డారు. దారిలో వస్తూ వస్తూ ఎక్కడైనా తీర్థం పుచ్చుకున్నారో ఏమో!కొంచెం కంట్రోల్ తప్పినట్లున్నాడు గురుడు. ఒకడు నా సైకిల్ ఆపి  “ఏరా! మేమంతా సినిమాకి వెళితే నువ్వు మాత్రం క్లాసు పెట్టిస్తావా? మేమంతా వెధవల్లాగా కనిపిస్తున్నామా నీకు? అసలు మేము లేకుండా నువ్వు క్లాస్ ఎలా పెట్టిస్తావు?అసలేం జరుగుతుంది ?  నాకు సమధానం చెప్పి తీరాలి?” అంటూ హరిక్రిష్ణ లెవెల్లో నన్ను అడ్డగించాడు.

నాకు ఏమి సమాధానం చెప్పాలో తోచలేదు.  నేను పడుతున్న ఇబ్బంది చూసి అందులో కొంచెం కంట్రోల్ లో ఉన్న ఇంకొకడు వాణ్ణి పక్కకి లాగి నన్ను నెమ్మదిగా జారుకోమన్నాడు. బ్రతుకు జీవుడా అంటూ అక్కణ్ణుంచి  బయట పడ్డాను.

ఇంక అప్పట్నుంచీ అలా ఎప్పుడూ క్లాసులు పెట్టించలేదు సరికదా నా పీజీ కోసం వరంగల్ కి వెళ్ళినపుడు బంక్ కొట్టడంలో నేనే ముందుండే వాడిని.
ఇదండీ నా తీపి జ్ఞాపకాల పుస్తకంలో ఒక పేజీ… ఎలా ఉంది?

ప్రకటనలు