వేటూరి… మాహా మొహం…

ఇటీవల ఈటీవీ లో ప్రసారమైన ఒక్కరే లిటిల్ చాంప్స్ కార్యక్రమం చూస్తున్నాను. వేటూరి సుందర్రామ్మూర్తి, వాణీ జయరాం, కళ్యాణ్ మల్లిక్  గార్లు దానికి న్యాయ నిర్ణేతలు.

ఒకమ్మాయి మంత్ర సినిమా లోంచి మహా మహా పాట పాడింది.

ఆ కార్యక్రమానికి వ్యాఖ్యాత,  తనకు రచయిత రాసిచ్చిన స్క్రిప్టును తానే ఆశువుగా చెప్పినట్లు బిల్డప్ ఇస్తూ

ఇప్పుడూ… ఈ పాట గురించి వేటూరి గారు ఏమంటారో తెలుసుకుందాం

అంది. వేటూరి గారు నెమ్మదిగా మైకందుకుని చల్లగా …

ఈ పాట గురించి మాట్లాడడానికి నాకు అర్హత లేదు. మాహా మాహా తప్ప నా మొహానికి ఇంకేమీ అర్థం కాలేదు

అన్నారు. ఆయన ఎందుకు ఆమాట అన్నారో కూడా అర్థం చేసుకోలేని సదరు వ్యాఖ్యాత ఆయనేదో జోకు చెప్పినట్లు నవ్వుతోంది. తెలుగు సినీసాహిత్యంలో మేలిమి వజ్రమైన వేటూరి గారిని,      ఇంగ్లీషు, తెలుగు, హిందీ (ఇంకా వేరేదైనా భాషలు ఉన్నా ఆశ్చర్యం లేదు!) పదాలు కలగలిపి, సంగీత వాద్యాల హోరులో ఆ పదాలను కూడా వినిపించ కుండా చేసిన సదరు పాట గురించి అభిప్రాయం అడగితే ఇంకేమి చెప్తాడు?

ఆ పాట గొప్ప పాట అని ఏ రచయిత ఐనా అన్నాడంటే వాళ్ళకు అంతకంటే ఆత్మహత్యా సదృశం ఇంకోకటి ఉండదేమో!

తెలుగు సినిమాలకు పాటలకు పట్టిన ఈ సంకర జాడ్యం ఇంకా వేళ్ళూనుకుంటుందనే నా భయమంతా…