వానర రాజు

ఒకానొక కాలంలో హిమాలయా పర్వత సానువుల్లో దాదాపు ఎనభై వేల సంఖ్యగల ఒక వానరజాతి నివసించేది. వాటన్నింటికీ బలశాలి, బుద్ధిశాలియైన ఒక వానరం రాజుగా ఉండేది. అవి నివసించే లోయ పక్కనే గంగానది ప్రవహిస్తూ ఉండేది. అన్ని కాలాల్లో వాటి దాహార్తిని తీరుస్తూ, ఎండాకాలంలో చల్లదనాన్నిస్తూ జనావాసాల వైపుకు సాగిపోయేది. నది ఒడ్డునే మధురమైన ఫలాల్నిచ్చే ఒక చెట్టు ఉండేది. వసంత ఋతువు వచ్చిందంటే దాని పరిమళం ఆ లోయంతా వ్యాపించేది. ఎండాకాలం ఆ చెట్టు యొక్క దట్టమైన నీడ వానరాలన్నింటికీ ఎంతో ఆదరువు. శరదృతువు వచ్చిందంటే దాని ఘనమైన, తీయనైన పండ్లు వాటి ఆకలిని తీర్చేవి. అలా అవి ఆ చెట్టు నీడన సుఖంగా జీవనం సాగిస్తుండేవి.

కానీ వానరరాజు మాత్రం ఆ పండ్లను గురించి వేరెవ్వరికీ తెలియకుండా జాగ్రత్త పడమని వాటికి చెప్పేవాడు. అలా జరిగితే మానవులంతా వచ్చి వాటిని తరిమేస్తారని వానర రాజు భయం. కాబట్టి ఆ కోతులంతా తమ ప్రభువు చెప్పినట్లు ఆ పండ్లను మానవుల చేతిలో పడకుండా కాపలా కాస్తుండేవి. చెట్టు బాగా ఏపుగా ఎదిగేసరికి బాగా పెరిగిన కొమ్మలు నదీ ప్రవాహం మీదకు వాలి ఉండేవి. రాజాజ్ఞ మేరకు ఆ కోతులు ప్రతి సంవత్సరం వసంతకాలంలో ఆ కొమ్మల్లో పూత పూయగానే వాటిని తినేసేవి. మళ్ళీ తాము ఏమైనా పూత వదిలేసి ఉంటామేమోనని వేసవిలో కూడా పండ్లు ఉన్నాయేమో మరొక్కమారు పరికించేవి. ఆ విధంగా ఏ ఒక్కపండూ నీళ్ళలో పడి జనావాసాల వైపు కొట్టుకుపోకుండా జాగ్రత్త పడేవి.


ఒకసారి కోతులు ఒక రెమ్మలో పూతను పొరబాటున వదిలేశాయి. వేసవిలో ఆ పండు కనపడకుండా ఆకులు కమ్మేశాయి. ఆ పండు బాగా పండి నదిలో పడిపోయింది. అలా కొట్టుకొని పోయి దూరంగా ఉన్న రాజు బ్రహ్మదత్తుని స్నాన ఘట్టం దగ్గర జాలర్లకు వలలో చిక్కింది. వాళ్ళు దాని పరిమాణాన్ని,పరిమళాన్ని చూసి అబ్బురపడి రాజుగారికి బహుమానంగా ఇస్తే మంచి ప్రతిఫలం దక్కుతుందన్న ఆశతో అక్కడికి తీసుకెళ్ళారు. ఆ పండు రాజుకే గాక సభికులందరికీ ప్రీతిపాత్రమైంది. వారందరికీ ఇంకా తినాలనిపించింది. బ్రహ్మదత్తుడు వెంటనే ఆ పండు ఎక్కడ నుంచి వచ్చిందో వెంటనే కనుక్కోవాల్సిందిగా ఆజ్ఞ జారీ చేశాడు.

ఆ పండు నదిలో దొరికింది కాబట్టి సైన్యాన్ని నదీ ప్రవాహానికి ఎదురుగా వెళ్ళి వెతకమన్నాడు రాజు. కొన్ని రోజులకు వాళ్ళకి ఆ చెట్టు కనిపించింది. వాళ్ళు తిరిగి వచ్చి ఆ చెట్టు ఇంకా పండ్లతోనే నిండి ఉన్నదనీ, కానీ ఒక కోతిమూక వాటిని తింటూ ఉండటం చూశామని చెప్పారు. రాజు ఆశ్చర్యపోయాడు. అంతమంచి పండ్లు కోతుల పరం కావడమా? అని ఆలోచించి ఆ కోతులన్నింటినీ చంపివేస్తే తరువాత సంవత్సరం నుంచీ ఆ పండ్లన్నీ తమకే చెందుతాయని భావించాడు. కోతులు పారిపోకుండా ఒక భటుణ్ణి ఆ చెట్టుకు కాపలా పెట్టాడు.


కొన్ని కోతులు కొమ్మల చాటు నుంచి ఈ తతంగాన్నంతా తిలకిస్తున్నాయి. అవి ఎంతో బాధతో వచ్చి వానర రాజు దగ్గర తమ గోడు వెళ్ళబోసుకున్నాయి. “మనం ఈ ఆపద నుంచి బయటపడేలా లేము. వేరే చెట్టు మీదకు వెళ్ళాలంటే చాలా దూరం. మనమంతా చనిపోతామేమో!” అన్నాయి.

వానర రాజు కొద్ది సేపు తమ పరిస్థితి గురించి ఆలోచించి ఒక పథకం వేసింది. “నేను బాగా బలిష్టంగా ఉన్నాను కాబట్టి మీకు నేను సహాయం చేస్తాను.” అన్నది.

మరుసటి రోజు ఉదయాన్నే వానర రాజు ఒక్క ఉదుటున నదికి ఇవతల ఉన్న పండ్ల చెట్టు నుంచి నదికి అవతల ఉన్న మరో వృక్షం మీదికి దూకింది. ఆ వృక్షం యొక్క బలమైన, పొడుగ్గా ఉన్న ఊడని పట్టుకుని ఒక కొన బలమైన కొమ్మకు ముడివేసింది. మరో కొన తన కాలికి ముడివేసుకొన్నది. తిరిగి పండ్ల చెట్టు మీదకు లంఘించి ఓ కొమ్మని పట్టుకొంది. కానీ రెండు చెట్ల మధ్య కట్టడానికి ఆ ఊడ పొడవు సరిపోలేదు. ఇప్పుడు తన జాతిని రక్షించడానికి ఒకే ఒక్క దారి ఉంది. అలాగే కొమ్మని పట్టుకొని మిగతా వానరాలన్నింటినీ తన మీద నుంచి దాటి మరో చెట్టు మీదకి దూకి వాటి ప్రాణాలు రక్షించుకోమని కోరింది. కొన్ని గంటల పాటు ఆ ఎనభైవేల కోతులన్నీ ఆ రాజు మీదుగా దూకి నదికి అవతలివైపుకు చేరుకున్నాయి. చివరి కోతి దాటుకుని వెళ్ళేంత వరకూ తన శక్తినంతా కూడదీసుకుని పట్టుకుని ఉన్న రాజు చివరికి బాధతో మూలుగుతూ కిందపడిపోయింది. బ్రహ్మదత్తుడు ఈ శబ్దాన్నంతటినీ విని మేల్కొని ఉన్నాడు. తన ప్రజల కోసం ఆ వానర రాజు పడ్డ తాపత్రయమంతా కళ్ళారా చూశాడు. అది కింద పడిపోగానే సేవకుల్ని నీళ్ళు, నూనె తెచ్చి దానికి సపర్యలు చేయడం ప్రారంభించాడు.

“నువ్వు మీ ప్రజలను రక్షించడం కోసం చేసిన త్యాగం అమోఘమైనది.” బ్రహ్మదత్తుడు వానరరాజును ప్రశంసించాడు.

“వాళ్ళు నాయందు నమ్మకముంచారు. కాబట్టి నేను వారిని కాపాడి తీరాలి. వాళ్ళందరూ సురక్షితంగా బయటపడ్డందుకు నాకు సంతోషంగా ఉంది. నేనిక నిశ్చింతగా చనిపోవచ్చు. కానీ రాజా! ప్రేమ మాత్రమే నిన్ను గొప్ప రాజును చేస్తుంది. అధికారం మాత్రం కాదు.” అని చెప్పి అది కన్ను మూసింది.

వానర రాజు చనిపోతూ చెప్పిన ఆ మాటలు బ్రహ్మదత్తుడు ఎన్నడూ మరిచిపోలేదు. తన జీవితాంతం దాన్ని గుర్తు పెట్టుకునే ఉన్నాడు. దానికోసం ఓ గుడి కూడా కట్టించాడు. అప్పటి నుంచి తన ప్రజలను కూడా అదే విధంగా పరిపాలిస్తూ గొప్ప కీర్తిని సంపాదించుకున్నాడు.

కాలుతున్న గుడిసె దేనికి సంకేతమో?

సముద్రంలో ప్రయాణిస్తున్న ఓ నావ అకస్మాత్తుగా ప్రమాదానికి గురయింది. అందులో కేవలం ఒక్క వ్యక్తి మాత్రం అదృష్టవశాత్తూ బతికి బయటపడి ఒక కొయ్య దుంగ మీద తేలుతూ జన సంచారం లేని ఒక దీవిలోకి వచ్చి పడ్డాడు.

ఆ ప్రమాదం నుంచి రక్షించమని రోజూ భగవంతుని వేడుకుంటూ ఉన్నాడు. ఎవరైనా తనను రక్షించడానికి వస్తారేమోనని సముద్రం వైపు ఆశగా ఎదురు చూసేవాడు. కానీ ఎవరూ కానరాలేదు. చూసి చూసి విసిగి పోయాడు. ప్రకృతి శక్తుల నుండి రక్షణ కోసం తేలుతూ వచ్చిన చెక్కలతో ఒక చిన్న గుడిసె నిర్మించుకున్నాడు. ఆ గుడిసె లో అలల తాకిడికి కొట్టుకువచ్చిన కొన్ని పనికొచ్చే వస్తువులు దాచుకున్నాడు.

ఇలా ఉండగా ఒక రోజు ఎంత తిరిగినా ఏమీ ఆహారం దొరకలేదు. తిరిగి గుడిసె దగ్గరకు వచ్చేసరికి అది తగలబడిపోయి పొగలు పైకి లేస్తున్నాయి. తనకున్న ఒక్క ఆధారం కూడా అగ్నికి ఆహుతి అయిపోయింది. అతనికి ఏం చేయాలో తోచలేదు. బాధతో కుంగిపోయాడు.  తనకు పట్టిన దుర్గతిని తలుచుకుని దుఃఖిస్తూ అలాగే నిద్రపోయాడు.

తెల్లవారి లేచి చూసేసరికి ఒక నావ అతనుండే దీవిని సమీపిస్తూ కనిపించింది. అది అతన్ని రక్షించడానికే వచ్చిందని తెలిసిన అతని ఆనందానికి అవధుల్లేవు. ఆ నావలోని వాళ్ళలో ఒకర్ని “నేను ఇక్కడున్నానని మీకెలా తెలిసింది?” అని అడిగాడు.

“నువ్వు పొగ ద్వారా మాకు సంజ్ఞలు చేశావు కదా. దానిని గుర్తు పట్టే ఇక్కడికి రాగలిగాం” అన్నాడు.

ఒక్కోసారి మన ఆశల సౌధాలు ఇలాగే ఒక్కసారి తగలబడిపోవచ్చు. కానీ అదే మంటలు ఏ భగవంతుని రాకకో సంకేతం కావచ్చు.

విద్యాసాగరుని త్యాగం

బెంగాల్ కు చెందిన ఈశ్వరచంద్ర విద్యాసాగర్ గురించి మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. ఆయన విద్యా సంపద, దయాగుణం చూసి అచ్చెరువొందని వారు లేరంటే అతిశయోక్తి కాదు. బెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవనంలో ప్రముఖ పాత్ర పోషించారాయన.

అప్పట్లో ఆయన బ్రిటీష్ ప్రభుత్వం నిర్వహించే ఒక సంస్కృత కళాశాలలో సంస్కృతం బోధించేవారు. ఒకసారి ఆ సంస్థలో ఒక ఉన్నత స్థాయి ఉద్యోగానికి ఖాళీ ఏర్పడింది. ఆ ప్రిన్సిపల్ అందుకు విద్యాసాగర్ సరైన వ్యక్తి అని అనుకున్నాడు. కానీ విద్యాసాగర్ అందుకు ఒప్పుకోలేదు.

ఆ ప్రిన్సిపల్ ఎందుకని అడిగాడు.

“ఎందుకంటే నా కంటే సంస్కృతం బాగా తెలిసిన వారు ఇంకొకరున్నారు. ఈ పదవికి వారే అర్హులు” అన్నారు.

అప్పుడా ప్రిన్సిపల్ “చూస్తుంటే బతకనేర్చిన వాడిలా లేవు. నీకు డబ్బు అవసరమా? లేదా? నీవు పెద్ద కుటుంబాన్ని పోషించాలని గుర్తుంచుకో. మీ సహోదరులు నీమీదనే ఆధారపడి ఉన్నారు. నాకు నీ మీద ఎనలేని విశ్వాసం, గౌరవం ఉన్నాయి. కాబట్టి ఈ పదవిని నువ్వే స్వీకరించాలి” అన్నాడు.

అయినా విద్యాసాగరుడు తన పట్టు వదల్లేదు. “నాకన్నా ఎక్కువ పరిజ్ఞానం గలవారు ఇంకొరున్నారు. ఆయన సాక్షాత్తూ మా గురువులు” అన్నాడు.

“నీతో నేను అంగీకరించలేను” అన్నాడు ఆ ప్రిన్సిపల్.

“మీరెన్ని చెప్పినా సరే, నాకు మాత్రం ఆ పదవి స్వీకరించడం ఇష్టం లేదు” అన్నాడు విద్యాసాగర్.

“సరే! ఆ పదవికి ధరఖాస్తు చెయ్యాలంటే ఎల్లుండి దాకే సమయముంది. మీ గురువు గారు అందుకు అప్లై కూడా చేయలేదు. లేకపోతే దాన్ని అధికారికంగా గుర్తించలేము ” అన్నాడు.

“అలా అయితే నేనే మా గురువు గారింటికి వెళ్ళి అప్లికేషన్ తీసుకు వస్తాను” అన్నాడు విద్యాసాగర్.

సుమారు యాభై మైళ్ళ దూరంలో ఉన్న ఆయన గురువు గారి దగ్గరకు వెళ్ళాలంటే విద్యాసాగర్ కొన్ని గ్రామాలు దాటి వెళ్ళాలి.  దాన్ని దాటాలంటే ఎద్దుల బండి ఉండాలి. లేకపోతే నడకే శరణ్యం. ఆయన విద్యా సంపన్నుడు, దయా సంపన్నుడేకానీ శారీరక బల సంపన్నుడు కాదు. ఆయనికి అంత దూరం నడవాలంటే నిజంగా కష్ట సాధ్యమైన పనే. ఆ రోజు మధ్యాహ్నమే బయలు దేరి మరుసటి రోజుకు వారి గురువుగారిల్లు చేరాడు. గురువు గారు విద్యాసాగర్ ఎందుకోసం వచ్చాడో తెలుసుకోగానే కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ఆయన్ని ఒక్కసారిగా గట్టిగా కౌగలించుకున్నాడు.

“భగవంతుడు కరుణా సముద్రుడయ్యా! నువ్వు నా మీద కరుణతో అంత దూరం ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి నడిచి వచ్చావు. పేరులోనే ఈశ్వరుణ్ణి పెట్టుకున్నావు. సాక్షాత్తు భగవత్స్వరూపుడివయ్యా నీవు” అని ఆశీర్వదించాడు.

విద్యాసాగర్ ఆ అప్లికేషన్ ని నింపి, గురువు గారి చేత సంతకం చేయించుకున్నాడు. మళ్ళీ యాభై మైళ్ళు వెనక్కి నడిచి తన గ్రామాన్ని చేరుకునే సరికి బాగా అలిసిపోయాడు. కానీ తన గురువు గారికి ఉద్యోగం లభిస్తుందన్న ఆనందం మాత్రం అతన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. ఆ ప్రిన్సిపల్ మాత్రం కుర్చీ లో కూర్చుని మారు మాట్లాడలేకపోయాడు. అసలీ విద్యాసాగర్ లాంటి మనుషులు ఈ భూమ్మీద ఇంకా ఉన్నారా? అని ఆశ్చర్యపోయాడు.

అప్పట్నించీ విద్యాసాగర్ కి నెలకి యాభై రూపాయలు లభిస్తే ఆయన గురువు గారికి తొంభై రూపాయాలు లభించేది.

ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ గురించి వికీపిడియా లో ఇక్కడ చదవండి.

అన్నం పరబ్రహ్మ స్వరూపం

నేను ఏడో తరగతికొచ్చేదాకా మా అవ్వ (అమ్మమ్మ) అన్నం కలిపి చేతిలో పెట్టేది.
“నాకింకొద్దన్నం” అని మారాం చేసినప్పుడల్లా మా అవ్వ, “తప్పు నాయనా అలా అనకూడదు. అన్నం పరబ్రహ్మ స్వరూపం. దాన్ని వృధా చేయకూడదు. మనం వడ్డించుకునేటప్పుడే కావాల్సినంత వడ్డించుకోవాలి గానీ మిగిల్చి పారేయకుడదు.” అని ఎలాగోలా సర్ది చెప్పేసి ఆ మాట, ఈ మాట చెబుతూ లోనికి పంపించేసేది.
ఇంక మా నాయనమ్మ ఇంట్లో ఎవరైనా ఎక్కువ వడ్డించుకుని పూర్తి చేయడానికి అవస్త పడుతుంటే
“నీకు కళ్ళు కావాలంటాయి. కడుపు వద్దంటుంది” అని నవ్వుతూ ఎగతాళి చేస్తుంటుంది.


అప్పట్లో అలా చెప్పడం వల్ల ఇప్పటికీ నాకు అన్నం వదిలేయాలంటే మనసొప్పదు. ఇంటిదగ్గర ఉన్నప్పుడు తప్పనిసరి వదిలేయాల్సి వస్తే మా కుక్కకి గానీ, మా బర్రెలు తాగే కుడితిలోగానే పోసేసేవాళ్ళం . కానీ ఇల్లు వదిలి వచ్చింతర్వాత అలా పారేయాల్సినప్పుడల్లా మనస్సు చివుక్కుమంటూ ఉంటుంది. అందుకే నాకు పెద్ద పెద్ద విందులకు వెళ్ళాలంటే ఇదే బాధగా ఉంటుంది. ఇదంతా ఎందుకు గుర్తొచ్చిందంటే ఈ మధ్య మా మిత్రుడొకరు పంపించిన ఈ మెయిల్ చదివి. దాని సారాంశాం క్లుప్తంగా ఇదీ!

* * *

జర్మనీ పారిశ్రామికంగా బాగా అభివృద్ధి చెందిన దేశమని మనకు తెలిసిందే. పెద్ద పెద్ద కార్ బ్రాండ్ లైన బెంజ్, వోక్స్‌వ్యాగన్, బీఎండబ్ల్యూ జర్మనీకి చెందినవే. అలాంటి దేశంలో ప్రజలు చాలా విలాసవంతమైన జీవితం గడుపుతారని చాలామంది అభిప్రాయం. కానీ ఉద్యోగం కోసం మొదటి సారిగా జర్మనీలోని హాంబర్గ్ వెళ్ళిన ఒక యువకుడి మనోగతం ఇది.

మొదటి రోజు ఆఫీసుకు వెళ్ళినపుడు మా ఆఫీసులో పనిచేసే సహోద్యోగులంతా కలిసి ఒక రెస్టారెంట్ లో స్వాగతం విందు ఏర్పాటు చేశారు.


మేము రెస్టారెంట్ లో అడుగు పెట్టగానే అక్కడ చాలా టేబుళ్ళు ఖాళీగా కనిపించాయి. ఒక మూలగా ఉన్న టేబుల్ మీద ఒక యువ జంట కూర్చుని భోంచేస్తున్నారు. వాళ్ళ ముందు కేవలం రెండు వంటకాలు, రెండు క్యాన్ల బీరు ఉన్నాయి. గర్ల్‌ఫ్రెండ్ ను రెస్టారెంట్ కు తీసుకువచ్చి ఇంత పిసినారితనం చూపిస్తారా ఎవరైనా అనుకున్నాను.


ఇంకో టేబుల్ మీద కొంతమంది ముసలివాళ్ళు కూర్చుని భోంచేస్తున్నారు. ఒక వంటకం వడ్డించగానే దాన్ని కొద్దిగా కూడా మిగల్చకుండా పూర్తిగా తింటున్నారు.


తరువాత మాకు రాబోయే వంటకాల కోసం ఎదురుచూస్తూ మేము వాళ్ళ మీద పెద్దగా దృష్టి సారించలేదు.  మాకు బాగా ఆకలిగా ఉండటంతో మా సహోద్యోగి ఇంకా ఎక్కువగా ఆర్డర్ ఇచ్చాడు.


రెస్టారెంట్ అంతా నిశ్శబ్ధంగా ఉంది. మేం ఆర్డరిచ్చిన వంటకాలు తొందరగానే వచ్చేశాయి. మాకు ఇంకా వేరే కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసి ఉండటం చేత తినడానికి ఎక్కువ సమయం కేటాయించలేకపోయాం. మేం భోజనం దగ్గరనుంచి లేచేసరికి సుమారు మూడోవంతు వంటకాలు మిగిలిపోయాయి.


ఇంక మేం రెస్టారెంట్ వదిలి వెళతామనగా మమ్మల్ని ఎవరో పిలుస్తున్నట్లనిపించింది. వెనక్కి తిరిగి చూస్తే ఆ ముసలి వాళ్ళు మా గురించే రెస్టారెంట్ యజమానితో మాట్లాతున్నట్లనిపించింది. మేం వెళ్ళి వాళ్ళతో ఆంగ్లంలో మాట్లాడేసరికి మేం అలా ఆహార పదార్థాలు వదిలేయడం వారికి ఇష్టంలేదన్నట్లుగా చెప్పారు. మనం ఎంత తింటే వీళ్ళకెందుకు అని మనసులో అనుకున్నాం.


మా సహోద్యోగి ఒకరు మధ్యలో కలుగజేసుకుని “మేం తిన్న ఆహారానికి మేం ఖర్చు పెట్టుకున్నాం. మేం ఎంత వదిలేస్తే మీకెందుకు?” అని అడిగాడు వాళ్ళని.


మా మాటలతో వాళ్ళకి కోపం వచ్చినట్లుంది. వాళ్లలో ఒకరు మొబైల్ ఫోన్ తీసుకుని ఎవరికో ఫోన్ చేశారు. కొంత సేపటి తర్వాత సోషియల్ సెక్యూరిటీ సంస్థ నుంచి ఓ యూనిఫాం వేసుకున్న వ్యక్తి అక్కడ ప్రత్యక్షమయ్యాడు. వాళ్ళని అడిగి జరిగిన సంగతి తెలుసుకుని 50 యూరోలు జరిమానా విధించాడు.


మేమంతా నిశ్శబ్ధంగా ఉండిపోయాం. మా జర్మన్ సహోద్యోగి తన జేబులోంచి 50 యూరోల నోటు తీసి అతనికి అందించి పలుమార్లు క్షమాపణ అడిగాడు.


అతను వెళుతూ వెళుతూ ధృడమైన కంఠ స్వరంతో  

మేరెంత తినగలరో అంతకే ఆర్డర్ ఇవ్వండి. డబ్బు మీదే కావచ్చు. కానీ వనరులు సమాజం మొత్తానివి. ప్రపంచంలో చాలా మంది వనరుల కొరతతో బాధ పడుతున్నారు. నిష్కారణంగా వనరులు వృధా చేయడం మంచిది కాదు

అని చెప్పి చక చకా వెళ్ళిపోయాడు.

మా ముఖాలు అవమానంతో ఎర్రబడ్డాయి. వాళ్ళ ఆలోచనను మనసులోనే అభినందించాం. దానికి తగ్గట్టే మమ్మల్ని మేం మార్చుకోవాలనుకున్నాం. గొప్పలకుపోయి పెద్ద పెద్ద మొత్తాల్లో ఆహారపదార్థాలను ఆర్డర్ చేయించుకుని చాలా వరకు తినకుండా వదిలేస్తూ ఉంటాం. ఈ పద్ధతి మార్చుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నాం.

Follow

Get every new post delivered to your Inbox.

Join 30 other followers