పురందర దాసు కథ

పురందర దాసుపురందర దాసును ఆధునిక కర్ణాటక సంగీతానికి ఆద్యుడు అనవచ్చు. పుట్టుకతో ధనవంతుడూ, పిసినారి అయిన ఆయన పరమ భక్తుడు కావడం వెనుక ఆసక్తికరమైన కథ ఉంది. ఆయన మహారాష్ట్ర లోని పూనా సమీపంలో ఒక పురందరగడ్ అనే కుగ్రామంలో జన్మించాడు. ఇది అప్పట్లో విజయనగర సామ్రాజ్యంలో ఉండేది. ఆయన జన్మనామం శ్రీనివాస నాయక్. వారి పూర్వీకులు వజ్రాల వ్యాపారం చేసే వారు. బాగా కలిగిన కుటుంబం. ఆయన కూడా అదే వ్యాపారంలో ప్రవేశించి బాగా ధనం సంపాదించాడు. ఆయన్ని నవకోటి నారయణుడు అని కూడా అనేవారు. అయితే మొదట్లో చాలా పిసినారిగా ఉండేవాడు. డబ్బు తప్ప వేరే ఆలోచన లేకుండా ఉండేవాడు. ఆయన భార్య పేరు సరస్వతీ భాయి. ఆమె పరమ భక్తురాలు. దయాగుణం కలది.  భర్త లోభ గుణం గురించి తెలిసినా ఏమీ చేయలేకపోయేది.

ఇలా ఉండగా ఒక రోజు ఒక పేద బ్రాహ్మణుడు తన కుమారుడి ఉపనయనం కోసం ధన సహాయం చేయమని శ్రీనివాస నాయక్ దగ్గరకు వచ్చాడు. ఆయన్ని తర్వాత రమ్మంటూ పంపించి వేశాడు. అలా ఆ బ్రాహ్మణుని చాలా రోజులు తన చుట్టూ తిప్పుకుంటూనే ఉన్నాడు కానీ ధన సహాయం మాత్రం చేయలేదు. ఆ బ్రాహ్మణుడు కూడా పట్టు విడువకుండా అలా తిరుగుతూనే ఉన్నాడు.  ఆరు నెలలు గడిచాయి. చివరకు ఆ బ్రాహ్మణుడిని ఎలాగైనా వదిలించుకోవాలని తన దగ్గరున్న పనికిరాని రాని నాణేలన్నీ ఒక కుప్పగా పోసి అందులో అతనికి నచ్చిన ఒక నాణేన్ని తీసుకుని మళ్ళీ ఎప్పుడూ తిరిగి రావద్దని చెప్పాడు. ఆ బ్రాహ్మణుడు చేసేదేమీ లేక నిరాశతో అక్కడ్నుంచి వెనుదిరిగాడు.

వెళుతూ వెళుతూ సరస్వతి భాయి ధార్మిక గుణం గురించి తెలుసుకొని నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్ళి, ఆమె భర్త తనను చాలాకాలం తిప్పుకుని చివరకు రిక్త హస్తాలతో ఎలా తిప్పిపంపాడో వివరించాడు. ఆమె ఆ పేద సుబ్రాహ్మణుడి పట్ల తన భర్త ప్రవర్తించిన తీరు విని చాలా బాధ పడింది. ఎలాగైనా ఆ బ్రాహ్మణుడికి సహాయ పడాలనుకుంది. కానీ తన భర్త అనుమతి లేకుండా అతని సొమ్ము చిల్లిగవ్వ కూడా ఇవ్వలేనంది. ఆ బ్రాహ్మణుడు కొద్దిగా ఆలోచించి “అయితే మీకు పుట్టింటి వారు ఇచ్చింది ఏదైనా ఉంటే ఇవ్వండి” అన్నాడు. అప్పుడామె తన ముక్కెర ను తీసి ఆయనకు ఇచ్చింది.

ఆ బ్రాహ్మణుడు అది తీసుకుని నేరుగా శ్రీనివాస నాయక్ దుకాణానికే వెళ్ళాడు. మళ్ళీ తిరిగి రావద్దన్నా ఎందుకొచ్చావంటూ ఆ బ్రాహ్మణున్ని కోప్పడ్డాడు శ్రీనివాస నాయక్. ఆ బ్రాహ్మణుడు శాంతంగా “అయ్యా! నేను యాచించడానికి రాలేదు. ఇదిగో ఈ ముక్కెర తాకట్టు పెట్టి కొంత ఋణం తీసుకుందామని వచ్చాను” అన్నాడు.

ఆయన ఆ ముక్కెర చూడగానే తన భార్యదేనని గుర్తు పట్టేశాడు. ఆ బ్రాహ్మణుడిని అడిగితే అది ఎవరో దాత ఇచ్చిందని తెలిపాడు. ఆ బ్రాహ్మణుడిని మరలా రేపు రమ్మని, ఆ ముక్కెరను జాగ్రత్తగా ఇనప్పట్టె లో దాచి  ఇల్లు చేరాడు శ్రీనివాస నాయక్. తన భార్యను పిలిచి ముక్కెర ఏదని అడిగాడు. ఆమె పొంతన లేని సమాధానాలు ఇచ్చేసరికి దాన్ని చూపించవలసిందిగా పట్టుబట్టాడు. ఆ పేదబ్రాహ్మణుడికి ఆమే తన ముక్కుపుడక దానం చేసి ఉంటుందని ఆయన అనుమానం.

సరస్వతీ భాయి కి కాళ్ళ కింద భూమి కదులుతున్నట్లయింది. నిజం చెబితే భర్త తన్ని ఖచ్చితంగా శిక్షిస్తాడని భయపడింది. మరో ప్రత్యామ్నాయం ఆలోచించక ఆమె ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. ఒక చిన్న గ్లాసులోకి విషాన్ని ఒంపుకొని నోటి దగ్గరకు తీసుకోబోయింది. ఇక తాగబోతుండగా ఆమెకు ఆ గ్లాసులో ఏదో గల గల మని సవ్వడి వినిపించింది. కిందికి దింపి చూస్తే తను బ్రాహ్మణుడికి దానం చేసిన ముక్కెర కనిపించింది. ఆమె తన కళ్ళను తానే నమ్మలేకపోయింది. ఆమె హృదయం ఆనందంతో, కృతజ్ఞతతో నిండిపోయింది. తన ఇంట్లోని కృష్ణ విగ్రహం ముందు మోకరిల్లి దాన్ని తీసుకుని వెళ్ళి తన భర్తకు చూపించింది. దాన్ని చూసేసరికి శ్రీనివాస నాయక్ కు మతి పోయినంత పనైంది. అది అచ్చం తాను అంగడిలో దాచి వచ్చిన ముక్కుపుడక లాగే ఉంది.

వెంటనే ధృవీకరించుకోవడానికి తన దుకాణానికి వెళ్ళాడు. తను ఉంచిన చోట చూస్తే ఆ ముక్కుపుడక లేదు. ఆయన మాట పెగల్లేదు. తిరిగి ఇంటికి వెళ్ళి అసలేం జరిగిందో చెప్పమని భార్యను ఒత్తిడి చేశాడు. ఆమె జరిగిందంతా పూసగుచ్చినట్లు వివరించింది. ఇదంతా విన్న ఆయన మనసులో సంక్షోభం చెలరేగింది.

తీవ్ర అంతర్మథనం తర్వాత, ఆ బ్రాహ్మణుడెవరో కాదు, సాక్షాత్తూ ఆ విఠలుడే అని తెలుసుకున్నాడు. గత ఆరు నెలలుగా జరిగిన సంఘటనలన్నీ ఆయన కళ్ళముందు కదలాడాయి. ఆయన పిసినారితనం మీద, ప్రవర్తన మీద ఆయనకే అసహ్యం వేసింది. తన భార్య తన కన్నా అదృష్టవంతురాలని అనిపించింది ఆయనకు. తనకు ధనం మీద ఉన్న వ్యామోహం వల్లనే భగవంతుని ఈ విధంగా కష్ట పెట్టవలసి వచ్చిందని తలంచి  తన దగ్గరున్న సమస్త సంపదలూ భగవంతుని పేర దాన ధర్మాలు చేసేశాడు.

అప్పట్నుంచీ ఆయన శ్రీహరి పరమ భక్తుడయ్యాడు. నవకోటి నారయణుడు, నారాయణ భక్తుడైపోయాడు. బంగారు, వజ్రాల నగలతో అలంకరణతో అలంకరింపబడ్డ చేతులిప్పుడు తంబురను చేతబట్టాయి. వివిధ రకాల బంగారు హారాలతో వెలసిన మెడలో ఇప్పుడు తులసి మాలలు దర్శనమిస్తున్నాయి. తన దగ్గరకు దేహీ అని వచ్చిన అనేక మంచి యాచకులను తిప్పి పంపిన తను ఇప్పుడు ఉదర పోషణార్థం భిక్షమెత్తుతున్నాడు. నలుగురితో పాటు జన్మించి నలుగురితో పాటు మట్టిలో కలిసిపోవాల్సిన శ్రీనివాస నాయక్ పురందర దాసు అయ్యాడు. పుట్టిన కొన్ని శతాబ్దాల తర్వాత కూడా తన కీర్తనల ద్వారా ప్రజల నాలుకలపై నాట్యమాడుతూ ఉన్నాడు. పరసవేది స్పర్శతో రాయి కూడా బంగారమైనట్లు పరమ లోభి కూడా ఆ భగవంతుని కృపతో హరిదాసులకు ఆది గురువయ్యాడు.

కన్ఫ్యూషియస్ సందేశం

క్రీ.పూ 6 వ శతాబ్దంలో చైనాలో జీవించిన ప్రఖ్యాత తత్వజ్ఞుడు కన్ఫ్యూషియస్ మరణ శయ్య మీదున్నాడు. ఆయన చుట్టూ ఆప్తులు, అనుయాయులు గుమికూడారు. అంతా విషాదంలో మునిగి ఉన్నారు. అప్పుడు కన్ఫ్యూషియస్ అతి హీనస్వరంతో

“నా నోట్లో ఏముందో చూసి చెప్పగలరా?” అన్నాడు.

అప్పటికే వయోవృద్ధుడైన ఆయన ఆ తాత్వికుని పళ్ళు ఊడిపోయాయి. కాబట్టి వాళ్ళు,

“అయ్యా మీ నోట్లో నాలుక మాత్రం ఉందండీ ” అని జవాబిచ్చారు.

ఆయన కాసేపాగి “మీ నోట్లో ఏమున్నాయి?” అని అడిగాడు.

“మా నోట్లో పళ్ళు, నాలుకా రెండూ ఉన్నాయండీ” అన్నారు వాళ్ళు తటపటాయించకుండా.

“చూశారా మనిషి పుట్టినపుడు నోట్లో నాలుక మాత్రమే ఉంటుంది. కాలక్రమంలో పళ్ళు మొలుస్తాయి. కానీ అవి నాలుక కన్నా బలంగా, దృఢంగా ఉంటాయి. క్రమంగా మనిషి వృద్ధుడయ్యేసరికి బలమైన పళ్ళు క్రమేణా రాలిపోతాయి. కోమలమైన, సున్నితమైన నాలుక మాత్రమే మరణం వరకు ఉంటుంది.”

ఆయన కాసేపు ఊపిరి తీసుకోవడం ఆగి

“మీ అందరికి ఇదే నా చివరి సందేశం. సున్నితమైనది, సరళమైనది చిరకాలం నిలుస్తుంది. కనుక సదా సరళ ప్రవర్తనులై మెలగండి. ప్రతి ఒక్కరితో ప్రేమగా, సరళంగా మాట్లాడటం అలవర్చుకోండి” అని చెప్పి కన్ను మూశాడు.

*శ్రీరామకృష్ణ ప్రభ సౌజన్యంతో…

మనకెందుకింత మొహమాటం?

శ్రీశైలం ఆనకట్ట దగ్గర విద్యుచ్ఛక్తిని ఉత్పత్తి చేసే యంత్రం ఒకటి పని చేయడం మొరాయించింది. మన దేశానికి చెందిన ఇంజనీర్లు సమస్య పరిష్కరించడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. దాంతో ఆ యంత్రాన్ని సప్లయ్ చేసిన జర్మనీ నుంచి నిపుణులని రప్పించాల్సి వచ్చింది.

వాళ్ళు వచ్చీ రాగానే పని ప్రారంభించారు. కొన్ని గంటల వ్యవధిలోనే సమస్య ఎక్కడో కనిపెట్టారు. దానికి పరిష్కార మార్గం కూడా సూచించారు. ఆ సమస్యాత్మక ప్రదేశం దగ్గరికి వెళ్ళాలంటే మొలలోతు బురద నీళ్ళు దాటి వెళ్ళాలి. నీట్ గా డ్రెస్ చేసుకొచ్చిన మన ఇంజనీర్లు అక్కడికి వెళ్ళమనగానే ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటున్నారు. పని వాళ్ళనెవరినైనా వెళ్ళమని పురమాయిస్తున్నారు.

వీళ్ళతో అయ్యేపని కాదనుకున్న ఆ జర్మన్ ఇంజనీర్లు గబాగబా సూటూ బూటూ విప్పి పక్కన పడేసి బురద నీళ్ళను దాటుకుంటూ వెళ్ళి పని పూర్తి చేసుకుని వచ్చేశారు. పని ఎలాంటిదైనా దాని పట్ల వారు చూపించే చొరవ, గౌరవం మనం పాశ్చాత్యుల నుంచి నేర్చుకోవాలేమో.. అనిపిస్తుంది నాకు.

బానిసకు బానిస

నేను ఎవర్ని? అనే నా ముందు టపాకు ఆధారమైన పూర్తి కథ ఇది. గ్రీకు దేశ ప్రజలు భారతదేశంలో నివసించే యోగులు, వారి అద్భుత శక్తుల గురించి విని ఉన్నారు. అలెగ్జాండర్ ప్రపంచ దండయాత్రకు బయలుదేరబోయే ముందు అక్కడి ప్రజలు ఒక భారతీయ యోగిని తమ దేశానికి తీసుకు రావాల్సిందిగా కోరారు. వారు అడవుల్లో నివసిస్తూ ఉంటారని కూడా తెలుసుకున్నాడు.

భారత్ కు వచ్చి ఒక అడవి గుండా ప్రయాణిస్తున్నాడు. మార్గ మధ్యంలో ఒక చెట్టు క్రింద తపస్సు చేసుకుంటున్న యోగి కనిపించాడు.  అలెగ్జాండర్ అక్కడ కాసేపు ఆగి, ఆ ఋషి కనులు తెరిచేదాకా ఎదురు చూశాడు. ఆయన వదనం ప్రశాంతంగా, తేజోవంతంగా ప్రకాశిస్తూ ఉంది.

“మేము మీకు మా రాజ్యంలో సకల సౌకర్యాలు కల్పిస్తాం. దయచేసి మాతో మా దేశానికి విచ్చేయండి. మా ప్రజలు మీ పట్ల ఎనలేని అనురాగం కనబరుస్తారు.” అని అభ్యర్థించాడు.

“క్షమించండి. నాకే సౌకర్యాలూ, సంపదలు అక్కర్లేదు.నాకు ఇక్కడ చాలా సంతోషంగా ఉంది. నేనక్కడకు రాలేను” సున్నితంగా తిరస్కరించాడా యోగి.

ఇప్పటి దాకా అలెగ్జాండర్ తన ఆజ్ఞను ధిక్కరించిన వాళ్ళనే చూడలేదు. ఈయన తన అభ్యర్థననే తోసి పుచ్చుతున్నాడు. పట్టరాని కోపం వచ్చింది. తనను తాను నియంత్రించుకోలేక పోతున్నాడు. చటుక్కున ఒర లోంచి కత్తి దూసి “నువ్వెవ్వరితో మాట్లాడుతున్నావు తెలుసా? ప్రపంచ విజేత అలెగ్జాండర్ చక్రవర్తిని నేను. నా ఆజ్ఞను ధిక్కరించిన మరుక్షణం నీ శరీరం ముక్కలు ముక్కలవుతుంది” అంటూ హుంకరించాడు.

ఆ యోగి ఏ మాత్రం తొణక్కుండా “నువ్వు నన్ను చంపలేవు. కేవలం నా శరీరాన్ని మాత్రమే చంపగలవు. ఈ దేహం కేవలం నేను ధరించిన వస్త్రం మాత్రమే. నేను దేహాన్ని కాదు. దేహంలో నివసించే ఆత్మను.”

“ఏమిటీ నువ్వు చక్రవర్తివా. నేను చెప్పనా నువ్వెవరో.”

“నువ్వు నా బానిసకు బానిసవు”

దిగ్భ్రాంతి చెందిన అలెగ్జాండర్ “నేనా! బానిసనా! అదెలా సాధ్యం?” అంటూ ప్రశ్నించాడు.

ఆ యోగి శాంత స్వరంతో ” నేను కోపాన్ని జయించాను. అది నా బానిస. క్షణ కాలంలో నువ్వు దానికెంత సులభంగా లొంగిపోయావు? కోపానికి బానిసవైపోయావు. ఇప్పుడు చెప్పు నువ్వు నా బానిసకు బానిసవు కాదా?”

మరేమీ మాట్లాడలేక అలెగ్జాండర్ ఆ యోగికి నమస్కారం చేసి వెళ్ళిపోయాడు.

Follow

Get every new post delivered to your Inbox.

Join 30 other followers