గోల్కొండ కోట సౌండ్ అండ్ లైట్ షో

గోల్కొండ కోటను ఎవరైనా సందర్శించాలని ఉంటే అక్కడ తప్పక  చూడవలసింది ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ వారు నిర్వహించే సౌండ్ అండ్ లైట్ షో. అందులో గోల్కొండ చరిత్రను ఒక నాటక రూపకంలో వివరిస్తారు.  కథను అమితాబ్ బచ్చన్ తన ధీరగంభీరమైన స్వరంతో వినిపిస్తాడు. మధ్యలో కొన్ని ముఖ్యమైన ఘట్టాలు పాత్రలు, సంభాషణల రూపంలో ఉంటాయి.  ఒక్కో సన్నివేశానికి సంభందించిన  సంభాషణలు కోటలో ఎక్కడ జరుగుతాయో అక్కడ లైట్లు వెలుగుతాయి. సంభాషణలు అక్కడి నుంచే వినిపిస్తున్నట్లుండి ఆ సన్నివేశం మన కళ్ళెదురుగా జరుగుతున్నట్లుగా ఉంటుంది.

ముఖ్యంగా రామదాసు ఘట్టం వచ్చినపుడు ఆయన్ను దాచి ఉంచినట్లుగా భావిస్తున్న చెరసాల నుంచి భావగర్భిత మైన బాలమురళీకృష్ణ గాత్రంలో “ఇక్ష్వాకు కుల తిలకా ఇకనైనా పలుకవే రామచంద్రా…”  అనే పాట వినగానే నిజంగానే అక్కడ రామదాసు ఉన్నట్లు, పాట పాడినట్లు అనిపించి ఒళ్ళంతా ఒక్కసారిగా జలదరించినట్లయింది నాకు. ఇంకా కులీ కుతుబ్ షా, భాగ్ మతీ దేవి ల మధ్య జరిగే ప్రేమ ఘట్టాలు, ఔరంగజేబు దండయాత్ర సమయంలో కోటను రక్షించడానికి రాజ కుటుంబం పడే తాపత్రయం చాలా అద్భుతంగా అనిపిస్తాయి. ఈ నాటకాన్ని వింటే ఎప్పుడో చిన్నప్పుడు విన్న రేడియో నాటకాలు గుర్తుకు వచ్చాయి. ఒక్కసారిగా నవాబుల కాలంలోకి వెళ్ళి తిరిగి వచ్చినట్లయింది.

పైన నేను చెప్పిన విశేషాలు మీకు ఆసక్తికరంగా అనిపిస్తే  సందర్శించడానికి వెళ్ళినప్పుడు ఈ ప్రదర్శనను మాత్రం తప్పక చూడండి.

టాలీవుడ్ ట్రోఫీ అప్‌డేట్స్

టాలీవుడ్ టీ20 ట్రోఫీ లైవ్ చూడలేని వారికోసం కేకలో అప్ డేట్స్.

అయ్యో కూలిపోయింది…

శ్రీకాళహస్తి రాజగోపురం

శ్రీకాళహస్తి రాజగోపురం

మా ఊరు శ్రీకాళహస్తికే తలమానికంగా నిలిచిన రాజగోపురం నిట్ట నిలువునా కూలిపోయింది. 1516 సంవత్సరంలో గజపతులపై విజయానంతరం  శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకుని విజయోత్సవ చిహ్నంగా శ్రీకృష్ణ దేవరాయలు ఈ గోపురాన్ని  నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. ఏడు అంతస్తులతో 135 అడుగుల ఎత్తు గలిగిన ఈ గాలిగోపురం ఉన్న పళంగా కూలిపోవడానికి మాత్రం ఖచ్చితమైన కారణాలు తెలియరావడం లేదు. గోపురంలో చీలికలు ఏర్పడ్డట్టు కొన్ని రోజుల ముందే కొన్ని టీవీ చానళ్ళు కథనాలు ప్రసారం చేయడంతో అధికారులు అప్రమత్తమై ఆర్కియాలజీ నిపుణుల్ని పిలిపించారు. వారు ఆ చీలికలను పరిశీలించి గోపురం చుట్టూ 150 మీటర్ల దూరం వరకు డేంజర్ జోన్ గా ప్రకటించారు. చుట్టు పక్కలా ఉన్న ప్రజల్ని తమ నివాసాల్ని ఖాళీ చేయించారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.

గోపురంలో ఇంతకు ముందే పగుళ్ళున్నప్పటికీ ఇటీవల సంభవించిన లైలా తుఫాను ధాటికి సమస్య మరింత తీవ్రమైనట్లు తెలుస్తోంది. సాధారణంగా గోపురంపై పక్షులు నివాసముండటం వల్ల వాటి రెట్టల వల్ల గోపుర పై భాగంలో అక్కడక్కడా చెట్లు మొలుస్తాయి. వాటిని ప్రతి ఏటా శివరాత్రి ఉత్సవాల సమయంలో తొలగిస్తుంటారు. వీటి వల్ల కూడా చీలికలు వచ్చి ఉంటాయని కొంతమంది భావిస్తున్నారు.

అలవాటు ప్రకారం ప్రతిపక్ష నాయకులు అధికారులపై, ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నా నిర్మాణం 450 సంవత్సరాల క్రితంది కావటం, మట్టితో నిర్మించడం, తుఫాను ప్రభావం మొదలైన ఎన్నో కారణాలున్నాయి. టీవీలు ప్రసారం చేసిన కథనాలకు వెంటనే స్పందించిన అధికార గణం, ఆలయ అధికారుల అప్రమత్తత వల్ల ఎంతో మంది ప్రాణాలు కాపాడ గలిగాయన్నది నిర్వివాదాంశం.

మరి ఉన్న చోటనే మళ్ళీ గాలిగోపురం నిర్మిస్తారో, లేక అలానే వదిలేస్తారో ఆ శ్రీకాళహస్తీశ్వరునికే తెలియాలి.

నాన్‌స్టాప్ కుమ్ముడే….

ఈ మధ్య ఈటీవీలో సందు దొరికితే చాలు “నాన్‌స్టాప్” కుమ్ముడు షురూ జేస్తాండు.

“నీకిష్టం లేకపోతే ఆ టీవీ ఎందుకు జూడాలే ఈ టపా ఎందుకు రాయాలే” అనద్దు.

అలవాటు పడ్డ ప్రాణం… పాడుతా తీయగా లాంటి కొన్ని ప్రాగ్రాముల కోసం చూడకుండా ఉండలేను. మధ్య మధ్యలో వచ్చే ఇలాంటి ప్రకటనలు వద్దనుకున్నా కంటబడతాయి. ఈ సినిమా జూసి హీరో ఎవరో విలన్ ఎవరో చెబితే కారు బహుమానం ఇస్తారంట…మనం చూసి చెప్పేది పక్కన బెడ్తే అసలు సినిమా దీసిన దర్శకుడికైనా, ఆ మాటకొస్తే ఆ సినిమాకు పని చేసిన బృందానికంతటికీ ఎవరికైనా తెలుసా అని!

ఇప్పుడు ఒక చిన్న పోటీ…

  • రచన, దర్శకత్వం, మాటలు, పాటలు వగైరా వగైరా… నాలుగు చేతులా నిర్వచించగల సవ్యసాచి మన సుమన్
  • తన క్రియేటివ్ బుర్రతో మన బుర్రలో గందరగోళం సృష్టించగల ప్రభాకర్..
  • చాలా సినిమాలకు నృత్యదర్శకుడు, ఆణిముత్యాల్లాంటి ముగ్గురు పిల్లలతో గౌరవంగా బతుకుతున్న సుందరం మాస్టార్ని “బొంగరం” మాస్టారు గా చేశాడు. పార్టిసిపెంట్ల మధ్య గొడవలు పెట్టి వినోదం చూసే అగ్గిపుల్ల సామి మన ఓంకార్…

వీళ్ళ ముగ్గర్లో ఎవరు గొప్ప మీరే తేల్చాలి…

Follow

Get every new post delivered to your Inbox.

Join 30 other followers