ఏమిటీ మూర్ఖత్వం?

ఇవాళ రాష్ట్రంలో ఉస్మానియా విద్యార్థులు చేస్తున్న రభస చూస్తుంటే నాలో అసహనం చెలరేగుతుంది. చిన్నప్పుడు పిప్పరమెంట్ తింటుంటే ఎవరైనా సావాస గాళ్ళు వచ్చి అడిగితే నోట్లో ఉన్నా సరే బయటకు తీసి చొక్కా మడతలో పెట్టి కొరికి సగం పంచిచ్చే వాళ్ళం. రాష్ట్రమేమన్నా పిప్పరమెంటు బిళ్ళా, అడగ్గానే సగం కొరికి ఇచ్చెయ్యడానికి?వాళ్ళను వాళ్ళు తగలబెట్టుకుని ఏం సాధిద్దామని?. వాళ్ళకు నచ్చజెప్పకుండా వాళ్ళ త్యాగాలను బలిదానాలని కీర్తించే భజన పరులు కొందరు. వీళ్ళలో ప్రొఫెసర్లు కూడా ఉండటం మరీ విడ్డూరం. కొంచెం కూడా తర్కం లేకుండా మాట్లాడటం వీళ్ళ ప్రత్యేకత.

తన సెలైనాహారదీక్షతో ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాన్ని అల్లకల్లోలంలోకి నెట్టేసిన కేసీయార్ పిల్లి కూతలకు భయపడిపోయిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణా ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమౌతుందంటూ ప్రకటన చేసింది. దీనికి  సీమాంధ్ర ప్రాంతాల నుంచి దిమ్మదిరిగే స్పందన ఎదురవడంతో ఆ ప్రకటన వెనక్కు తీసుకుంది. జేసీ లాంటి విజ్ఞుల సలహాతో రాష్ట్ర విభజన అంత తేలిగ్గా జరిగే ప్రక్రియ కాదనీ  తేల్చాల్సిన విషయాలు చాలా ఉన్నాయని గుర్తించిన ప్రభుత్వం తదుపరి ప్రకటనలో రాష్ట్ర విభజన కోసం విస్తృతమైన చర్చలు జరపాలనే అభిప్రాయం  వ్యక్తం చేసింది.

దాని ఫలితమే శ్రీకృష్ణ కమిటీ. ఎవరేమన్నా ఈ కమిటీ రాష్ట్ర విభజన కోసం వేసిన కమిటీయే. అసలు ఇప్పుడు సమైక్యంగానే ఉంటే మళ్ళీ సమైక్యంగా ఉండటానికి కమిటీ ఎందుకు? తెలంగాణా వాదుల డిమాండ్ మేరకే కదా ఈ కమిటీ ఏర్పడింది. దాన్ని గడ్డి పీకమని చెప్పి వీళ్ళు మాత్రం రోజూ ఉద్యమాలు చేస్తూ హైదరాబాద్ ను రావణకాష్టంగా మారుస్తారట. ఇదెక్కడి న్యాయం? అసలు వీళ్ళు విద్యార్థులేనా?

కొంచెం కూడా ఆలోచించరా? వీళ్ళకు ప్రత్యేక రాష్ట్రం కావాలంటే ఆ కమిటీ దగ్గరకు వెళ్ళి తమ వాదనలేమిటో బలంగా వినిపించాలి గానీ ఇలా వాళ్ళను వాళ్ళు తగలబెట్టుకుంటూ, వాళ్ళ భవిష్యత్తునే కాకుండా ఉస్మానియాలో చేరిన పాపానికి అమాయకులైన మిగతా విద్యార్థుల భవిష్యత్తును కూడా పాడుచేస్తూ ఏం సాధిద్దామనుకుంటున్నారో నాకర్థం కావడం లేదు.

Follow

Get every new post delivered to your Inbox.

Join 30 other followers